హైదరాబాద్
రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సంక్షేమ తెలంగాణ సాకారంపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. మహిళల సంక్షేమం, భద్రత, రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. గత పాలకులు మహిళా సంక్షేమానికి రూ. నాలుగున్నర కోట్లు ఖర్చు చేస్తే.. గడిచిన ఏడేండ్లలో సీఎం కేసీఆర్ రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలతో పాటు ఒంటరి మహిళ పెన్షన్లు, వితంతు పెన్షన్లు అమలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గిపోయాయి. పిల్లల ఎదుగుదల, పెరుగుదల కోసం అంగన్‌వాడీ సెంటర్ల నుంచి బాలామృతంతో పాటు కోడిగుడ్లు అందిస్తున్నామని తెలిపారు. కొవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగాయి. మన పథకాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రశంసించింది అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచి గౌరవించుకున్నామని చెప్పారు. తెలంగాణ మహిళా లోకం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందని మంత్రి తెలిపారు.