శ్రీనగర్ సెప్టెంబర్ 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: ఆర్మీ హెలిక్యాప్టర్ ఫోర్స్ ల్యాండింగ్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మేజర్లు రోహిత్ కుమార్, అనూజ్ రాజ్‌పుత్‌లకు భారత సైన్యం ఘనంగా నివాళులర్పించింది. ఆర్మీ ఉన్నతాధికారులు వారి భౌతికకాయాలపై పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. ఉధంపూర్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం ఉదయం జమ్ముకశ్మీర్ రాష్ట్రం పట్నిటాప్ సమీపంలో ఆర్మీకి చెందిన ఏవియేషన్ హెలిక్యాప్టర్ అదుపుతప్పడంతో బలవంతంగా ల్యాండ్ చేశారు.ఈ ఘటనలో ఆ హెలిక్యాప్టర్‌లోని ఇద్దరు పైలట్లు మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.