తిరుపతి,మా ప్రతినిథి, నవంబర్ 05
నగరంలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిలవకుండా కమిషనర్ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. అందులో భాగంగానే వర్షపునీరు సజావుగా వెళ్లేందుకు చేయాల్సిన ఏర్పాట్ల పై శుక్రవారం కమిషనర్ అధికారులతో కలిసి నాలుగుగంటల పాటు నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.
ముఖ్యంగా లీలామహల్ కూడలి, కరకంబాడీ రోడ్డు, తిరుమల బై పాస్ రోడ్డు, శ్రీనివాసం, రేణిగుంట రోడ్డు, లక్ష్మీపురం కూడలి, శ్రీనివాస కళ్యాణ మండపాలు తదితర ప్రాంతాల్లో గల డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. లీలామహల్ కూడలి వద్ద డ్రైనేజి కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తే మధురా నగర్, చేపల మార్కెట్ పైనుండి వచ్చే నీరు సజావుగా వెళ్తాయన్నారు. అలాగే లీలామహల్ నుండి కరకంబాడీ మార్గంలో ఇరువైపులా జరుగుతున్న డ్రైనేజి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. లీలామహల్ కూడలి వద్ద డ్రైనేజీ నిర్మాణానికి అడ్డుగా ఓ దుకాణం వారితో మాట్లాడి కొంత స్థలం తీసుకోవడంతో ఇబ్బంది తొలగింది. వారికి నష్టపరిహారం అప్పటికప్పుడే అందించారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఇలా సహకరించాలన్నారు. అక్కడక్కడా శ్రీనివాస సేతు నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు వెంటనే తొలగించాలని ఎస్పీడిసిఎల్ అధికారులు ఆదేశించారు. లక్ష్మీపురం కూడలి వద్ద నీరు సజావుగా వెళ్లేందుకు 3 అడుగుల మేర డ్రైన్ నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా కూడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద డ్రైనేజి పై ర్యాంప్ నిర్మాణం చేస్తుండగా ఆపివేయించారు. డ్రైనేజీ పై అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూడాలన్నారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఎస్పీడిసిఎల్ అధికారులు రమణ, పద్మనాభ పిళ్ళై, బాలాజీ, ఏ. సి.పి. 2 షణ్ముగం, అప్కాన్స్ ప్రతినిధి స్వామి తదితరులు ఉన్నారు.