హైదరాబాద్ నవంబర్ 24
బీజేపీ కార్పొరేటర్ల నిరసనను ఖండిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిసరాలతో పాటు లోగోను పాలతో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ధర్నాను టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. బీజేపీ ధర్నా జీహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు అని కార్పొరేటర్లు పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. అభివృద్ధిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓర్వలేకపోతున్నారు అని ధ్వజమెత్తారు. బీజేపీ కార్పొరేటర్లు పద్ధతి మార్చుకోవాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు వార్నింగ్ ఇచ్చారు.జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం దాడికి పాల్పడ్డ విషయం విదితమే. కార్యాలయంలో కనిపించిన వస్తువునల్లా ధ్వంసంచేస్తూ వీధి రౌడీల్లా ప్రవర్తించారు. పక్కా పథకం ప్రకారం తమ అనుచరులతో ఆఫీస్‌లోకి ప్రవేశించిన కార్పొరేటర్లు మొదటి అంతస్తులోని మేయర్ చాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతాసిబ్బంది అడ్డుకోవటంతో కమిషనర్ చాంబర్‌వైపు పరుగులు పెడుతూ పూలకుండీలు, కుర్చీలను ధ్వంసంచేశారు. కార్యాలయంలోని మైక్‌లను విరిచేశారు. అద్దాలు పగులగొట్టారు. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ లోగోపై ఇంకును స్ర్పే చేశారు. బీజేపీ కార్పొరేటర్ల బీభత్సంతో మేయర్, డిప్యూటీ మేయర్, కార్యదర్శి భయంతో చాంబర్ల తలుపులు మూసుకున్నారు. కార్పొరేటర్లు చిల్లర గూండాల్లా భవనమంతా పరుగులు పెట్టడంతో కార్యాలయ సిబ్బంది బేంబేలెత్తిపోయారు. బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత వారించినా కార్పొరేటర్లు వినిపించుకోకపోవడంతో పోలీసులు వచ్చి పలువురు బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లను అరెస్టు చేసి సైఫాబాద్, రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు న్యూసెన్స్ చేయడం, ప్రజా ఆస్తుల నష్టం కలిగించారని జీహెచ్‌ఎంసీ అధికారులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు