విజయవాడ నవంబర్ 1
దృఢమైన భౌతిక, సామాజిక, పారిశ్రామిక, మౌలిక సదుపాయాలతో రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణంతో, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ దర్భార్ హాలులో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకు గవర్నర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గౌరవ హరిచందన్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన అత్యున్నత త్యాగం ఫలితంగా తెలుగు ప్రజల చిరకాల వాంఛ సాకారమైందన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన నేతలు, స్వాతంత్య్ర సమర యోధులను తెలుగు జాతి ఎన్నటికీ మరువదని స్పష్టం చేసారు. కరోనా మహమ్మారి ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ కష్టాల నుండి కొత్త శిఖరాలను చేరుకోవాలనే ఉత్సాహం మనల్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తుందన్న అశాభావాన్ని వ్యక్తం చేసారు. ప్రపంచంలోని ప్రాచీనమైన, అందమైన భాషలలో తెలుగు భాష ఒకటన్న గవర్నర్, రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ భాషలన్నింటిలోకెల్లా తెలుగు తియ్యనిది అంటూ కీర్తించిన విషయాన్ని గుర్తు చేసారు. సహజ సంపదకు పెట్టని కోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ మొదలైన సహజ వనరులు, సారవంతమైన భూములు, గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదీ పరీవాహక ప్రాంతాలతో అనుకూలమైన వ్యవసాయ-వాతావరణం ఉందన్నారు. దేశంలో రెండవ పొడవైన తీర రేఖను కలిగి, దేశం యొక్క ఎగుమతుల్లో 40శాతం వాటాతో సముద్ర ఉత్పత్తుల యొక్క అతిపెద్ద ఉత్పత్తి, ఎగుమతిదారుల్లో ఒకటిగా ఉండటం గర్వకారణమన్నారు. కోవిడ్ సృష్టించిన క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో, ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కరోనా నుండి రక్షణ పొందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, వాక్సిన్ తీసుకున్నప్పటికీ ఎటువంటి అశ్రద్ద కూడదని వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ అత్యున్నత రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్...