తిరుపతి,మా ప్రతినిధి,సెప్టెంబర్ 25,
తిరుమల శ్రీవారి తత్త్వాన్ని లోకానికి చాటిన అన్నమయ్య కీర్తనలు అందరికీ చేరువ కావాలని ఎస్వీబిసి ఛైర్మన్ డా.శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర అన్నారు. ఎస్వీబిసి కార్యాలయం స్టూడియోలో శనివారం ” అదివో అల్లదివో ….అన్నమయ్య పాటల
పోటీలకు గాయకుల ఎంపిక కార్యక్రమం ప్రారంభమమైంది.
ఈ సందర్భంగా ఎస్వీబిసి ఛైర్మన్ మాట్లాడుతూ, అన్నమయ్య 32 వేల కీర్తనలను రచించగా, 14 వేల కీర్తనలు లభించాయని, వీటిలో ఇప్పటివరకు 4000 కీర్తనలను టిటిడి
ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డింగ్ చేసినట్లు తెలిపారు. అన్నమయ్య రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రాధాన్యం, విస్తృత ప్రచారం కల్పించాలని టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో నిర్ణయించినట్లు చెప్పారు. అదివో అల్లదివో
….కార్యక్రమం ద్వారా ఔత్సాహికులైన యువతి యువకులకు అన్నమయ్య పాటల పోటీలకు కళాకారుల ఎంపిక పరీక్షలు నిర్వహించి ఇందులో ఎంపికైన వారితో అన్నమయ్య సంకీర్తనలు పాడిస్తామన్నారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు
చెన్నై, బెంగుళూరు నగరాల్లోని యువతకు అన్నమయ్య కీర్తనలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. తొలుత జిల్లాస్థాయిలో, ఆ తరువాత రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తామని వివరించారు.
ఇందులో భాగంగా శని, ఆది వారాల్లో చిత్తూరు జిల్లాకు
చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న గాయనీ, గాయకులకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. యువ గాయని గాయకులు కొత్త పాటలు ఆలపించాలన్నారు.