తిరువనంతపురం నవంబర్ 15
కేరళలో శనివారం రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఐఎండీ కేరళలోని ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీచేసిన జిల్లాల్లో ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలు ఉన్నాయి. ఈ ఆరు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది.అదేవిధంగా, బంగాళాఖాతంలోని అండమాన్ దీవులవద్ద అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. రేపటికల్లా ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతానికి విస్తరిస్తుందని పేర్కొన్నది. నవంబర్ 17 నాటికి వాయుగుండంగా మారి, నవంబర్ 18న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.