హైదరాబాద్
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ప్రియురాలి బెడ్రూంలోకి చొరబడిన ప్రియుడు కత్తితో గొంతు కోశాడు. యువతి అరవడంతో తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. జీడిమెట్లకు చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్ బీ లోని ఎంఎన్ ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మాదాపూర్ లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడీల రూఖీ సింగ్ (21) బంధువు కావడంతో పరిచయం ఏర్పడింది. వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం యువతిని కాంటినెంటల్ హాస్పిటల్ లో, యువకుడిని కిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.