తిరువనంతపురం నవంబర్ 17
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో బారులుతీరారు. మణికంఠుడి దర్శనం కోసం వేల మంది క్యూలైన్‌లలో వేచిఉన్నారు. ప్రతి ఏడాది మండలపూజ, మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయ క్షేత్రాన్ని రెండు నెలలపాటు తెరచి ఉంచుతారు. 41 రోజుల మండల పూజల కోసం ఈ నెల 15 ఆలయాన్ని తెరిచారు. డిసెంబర్ 26న మండల పూజా ఉత్సవం ముగుస్తుంది.ఆ రోజు ఆలయాన్ని మూసివేసి మకరవిళక్కు (మకర జ్యోతి) ఉత్సవం కోసం డిసెంబర్ 30న తిరిగి తెరుస్తారు. జనవరి 14న భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం కలుగుతుంది. జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు. మళ్లీ నవంబర్ 15 వరకు శబరిమల అయ్యప్ప క్షేత్రం మూసే ఉంటుంది. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.72 గంటలలోపు చేయించిన ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా రోజుకు 30 వేల మంది మాత్రమే దర్శనానికి వెళ్లేలా పరిమితులు విధించారు.