కర్నూలు అక్టోబర్ 22
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ గిరి ప్రదక్షిణం తిరిగి ప్రారంభమైంది. అశ్వయుజ శుద్ధి పౌర్ణమి సందర్భంగా సంప్రదాయ శ్రీశైలం గిరి ప్రదక్షిణను ఆలయ పూజారులు పునః ప్రారంభించారు. సాధారణంగా, ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆచారం కొనసాగుతుంది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గిరి ప్రదక్షిణంను అధికారులు నిలిపివేశారు. తిరిగి ఏడు నెలల విరామం అనంతరం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున భక్తులు హాజరై గిరి ప్రదిక్షణం చేసుకున్నారు.ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న నేతృత్వంలో ఆలయ అధికారులు, పూజారులు దాదాపు 7 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. ఈ ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ మహా ద్వారం నుంచి ప్రారంభమై.. గంగాధర మండపం, అంకాలమ్మ ఆలయం, నంది మండపం, మల్లికార్జున సదన్, వీరభద్ర దేవాలయం, గోశాల, మల్లమ్మ కన్నీరు, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ప్రధాన దేవాలయానికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా, ఆలయ అధికారులు సంప్రదాయ లక్ష కుంకుమార్చన నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఆలయ వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.