పెద్దపల్లి సెప్టెంబర్ 27
రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను సంరక్షించే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి నేపథ్యంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో ఐటిఐలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. రక్తదానం చేసిన వారిని కలెక్టర్ అభినందించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నేపథ్యంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి దశ మరియు మలిదశ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్లడ్ బ్యాంకుల వద్ద రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి, రక్తదానం చేసే వారు ముందుకు వచ్చి ఇతరుల ప్రాణాలు సంరక్షణలో తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు. రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని, శరీరంలో కొత్త రక్తకణాలు తయారు అవుతాయని కలెక్టర్ తెలిపారు. రక్త నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో విధులతో పాటు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న జిల్లా టిఎన్జిఒ సంఘాన్ని కలెక్టర్ అభినందించారు. రక్త దానం శిభిర నిర్వహణతో పాటు అరుదైన బ్లడ్ గ్రూప్స్ డోనర్ల వివరాలతో జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గోన్ని రక్తదానం చేసిన డోనర్లకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మెడికల్ సూపరిండెంట్ వాసుదేవరెడ్డి , జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బోంకూరి శంకర్, కార్యదర్శి రాజనరేందర్ గౌడ్, టీఎన్జీవో సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.