హైదరాబాద్ అక్టోబర్ 7
టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్ సేవల ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం నాడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అజయ్ కుమార్ సమాధానం ఇచ్చారు.కార్గో పార్శిల్ సర్వీసులతో కస్టమర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హోం పికప్, హోం డెలివరీ పార్శిల్ సర్వీసులను ప్రవేశపెట్టాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. ప్రస్తుతం 195 కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. సమీప భవిష్యత్‌లో మరో 50 కార్గో వాహనాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.ఆర్టీసీకి సంబంధించి అదనపు ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో కార్గో పార్శిల్ సేవలను గత ఏడాది జూన్‌లో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కార్గో పార్శిల్ సేవలు 177 బస్ స్టేషన్ల నుంచి ఆపరేట్ చేస్తున్నాం. దాదాపు బల్క్ వస్తువుల రవాణా కోసం ఓల్డ్ బస్సులను వినియోగిస్తున్నాం. 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో బస్సులు 150, 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో బస్సులు 35, ఓపెన్ కార్గో బస్సులు 10 ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ డీలక్స్ బస్సుల్లో కూడా కొరియర్స్, చిన్న పార్శిల్‌ను రవాణా చేస్తున్నామని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు.