న్యూఢిల్లీ డిసెంబర్ 2
గడిచిన ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల పక్షాన నిలిచిందని లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన సభలో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ రైతులకు అండగా నిలవడం వల్ల రాష్ట్రంలో వరిపంట ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదు అయ్యిందన్నారు. గడిచిన ఏడేళ్లలో వ్యవసాయానికి నీళ్లు ఇస్తున్నామని, ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని, ఇంకా రైతు బంధు వల్ల కూడా తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, దానితో పంట దిగుబడి కూడా పెరిగిందన్నారు. ఇప్పుడు ఇండియాలో వరిపంట ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ఎంపీ నామా తెలిపారు. తెలంగాణ రైతుల అంశాన్ని పార్లమెంట్ వేదికగా గత మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నామన్నారు. తెలంగాణ వరిరైతుల అంశాన్ని పరిష్కరించాలని, ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతలను కేంద్రం విస్మరిస్తోందని నామా అన్నారు. ఇవాళ కూడా సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు.