హైదరాబాద్
రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా మారిందని పేర్కొంది. పశ్చిమ దిశగా కదిలి.. మరింత బలపడి వాళ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గోపాల్‌పూర్‌కు 470 కిలోమీటర్ల తూర్పు – ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి తుర్పు- ఈశాన్య దిశలో 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
రాబోయే ఆరు గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రా – దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం దగ్గర ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశాలున్నాయి. 27న ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర పాంత్రాల్లో తదుపరి 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.
ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి 29 నాటికి పశ్చిమ బెంగాల్ తీరం దగ్గరకి చేరుకునే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని వివరించింది.