మేడ్చల్
పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న గర్భిణీకి 108 సిబ్బంది పురుడు పోసిన ఘటన నారపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. మేడిపల్లి లోని విష్ణుపురి కాలనీలో నివాసముండే సోమ రేణుక (25) నిండు గర్భిణి సోమవారం రాత్రి పదకొండు గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. 108లో ఇంటి నుండి స్థానిక నారపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కానీ ఆ సమయంలో ప్రభుత్వ హాస్పత్రి సిబ్బంది తొందరగా రాకపోవడం, గర్భిణికి తీవ్రంగా నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సతీష్ కుమార్, పైలెట్ వెంకటరమణలు ఆస్పత్రిలోనే పురుడు పోసారు. రేణుక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి వద్ద ప్రాథమిక చికిత్స నిర్వహించిన 108 సిబ్బంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.