నెల్లూరు నవంబర్ 16
నెల్లూరు కార్పొరేషన్ పాలకమండలి సాధారణ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో జరిగాయని, పటిష్టమైన భద్రత నడుమ బుధవారం నాడు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులను ప్రకటించనున్నామని కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. స్థానిక డి.కె మహిళా కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న కౌంటింగ్ ఏర్పాట్లను కమిషనర్ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 46 డివిజన్లలో 52.25 శాతం ఓట్లు నమోదయ్యాయని, స్ట్రాంగ్ రూముకు చేరుకున్న బ్యాలెట్ బాక్సులను బుధవారం ఉదయం 8 గంటల నుంచి తెరిచి లెక్కించనున్నామని తెలిపారు. మొత్తం 145 టేబుల్స్ కు ఓట్లను విభాగించి, అన్ని వార్డులకు ఒకేసారి కౌంటింగ్ మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించాలనుకునే రాజకీయ పార్టీల అభ్యర్థులు ముందుగా స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని గుర్తింపు పత్రాలను పొందాలని కమిషనర్ సూచించారు. గుర్తింపు పత్రాలతో పాటు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా జతపరచాలని సూచించారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేనివారు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకొని కౌంటింగ్ ప్రక్రియకు హాజరుకావాలని కమిషనర్ తెలిపారు.