న్యూఢిల్లీ సెప్టెంబర్ 23
పెగాసిస్ స్పైవేర్ కేసు పరిశీలించేందుకు సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఇవాళ ఓ కేసు విచారణ సందర్భంగా సీజే వ్యాఖ్యానిస్తూ.. వచ్చే వారంలోగా పెగాసిస్ వ్యవహారంపై తాజా ఆదేశాలను జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసిస్‌తో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపై నమోదు అయిన పలు పిటిషన్లను సుప్రీం విచారిస్తున్నది. సెప్టెంబర్ 13వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా తన ఆదేశాలను చీఫ్ జస్టిస్ రిజర్వ్‌లో ఉంచారు. పెగాసిస్‌పై తాము ఏమీ దాచిపెట్టడం లేదని, జాతీయ భద్రత దృష్టా నిఘా సాగినట్లు కేంద్రం చెప్పింది. తాము ఏం సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నామో ఉగ్రవాదులకు తెలిసేలా వ్యవహరించలేమని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.