Home తెలంగాణ హుజురాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్‌ శ్రేనుల మేదోమదనం ...

హుజురాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్‌ శ్రేనుల మేదోమదనం గాంధీ భవన్ లో వాడివేడి చర్చ రేవంత్‌ వ్యవహారశైలిపై కాంగ్రెస్‌ సీనియర్లు ఆగ్రహం దారుణ ఓటమికి కారణాలెన్నో.

102
0

హైదరాబాద్‌
హుజురాబాద్‌ ఫలితం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘోర పరాజయం నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో వాడివేడిగా కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం సాగింది. సమావేశానికి కోమటిరెడ్డి, జగ్గారెడ్డి హాజరుకాలేదు. సమావేశం మధ్యలోనే జానారెడ్డి వెళ్లిపోయారు. రేవంత్‌ వ్యవహారశైలిపై కాంగ్రెస్‌ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ఘోర పరాభవాన్ని చవి చూపించింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దాదాపు 30 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ మంగళవారం దారుణ పరాజయం పాలయ్యింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్‌కు కేవలం 3,014 ఓట్లు (1.5 శాతం) మాత్రమే పోలయ్యాయి. కనీసం డిపాజిట్‌ దక్కించుకునేందుకు దరిదాపుల్లో కూడా లేకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను నివ్వెర పరిచింది.  శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సందర్భంగా సీనియర్లు చేసిన పలు వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అసంతృప్తిని మరోసారి బహిర్గతం చేశాయి.టీఆర్‌ఎస్, బీజేపీల నడుమ హోరాహోరీ అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్‌ గెలుస్తుందనే అంచనాలు ఎవరికీ లేకున్నా గత ఎన్నికల్లో 60 వేల పైచిలుకు ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి కనీసం అందులో సగమైనా వస్తాయని భావించారు. కానీ పూర్తి నిరాశాజనకంగా కేవలం 3 వేల ఓట్లకు మాత్రమే పార్టీ పరిమితం అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌ పార్టీకి ఇన్ని తక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారని రాజకీయ వర్గాలంటున్నాయి.
దారుణ ఓటమికి కారణాలెన్నో..

ఇంతటి ఘోర పరాజయానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అభ్యర్థి ఎంపికలో విపరీత జాప్యం, కేడర్‌కు భరోసా ఇవ్వడంలో వైఫల్యం, మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, అసలు తాము పోటీలో ఉన్నామనే భావనను అక్కడి ఓటర్లలో కలిగించడంలో విఫలం కావడంతోనే కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని పొందిందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఓవైపు టీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికల ప్రచారం పేరుతో గ్రామాలను చుట్టి వస్తుంటే పార్టీ నేతలు కనీసం హుజూరాబాద్‌ వైపు కన్నెత్తి చూడకుండా వేరే ప్రాంతాల్లో బహిరంగసభలు, సమావేశాలు పెట్టి కాలయాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో ఆయన ప్రభావం ఎక్కడా కనిపించలేదు.
చిత్తుగా ఓటమిపై రచ్చ
ఉప ఎన్నికలో పార్టీ ఘోర వైఫల్యంపై సీనియర్‌ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. మంగళవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక, సాగర్‌లలో పనిచేసినట్టు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పనిచేయలేదనిఅన్నారు. ఈ ఎన్నికను రేవంత్‌ వదిలేశారని విమర్శించారు. ఉప ఎన్నికపై పార్టీ అధిష్టానానికి నివేదిక ఇస్తానని చెప్పారు. ఏదిఏమైనా టీఆర్‌ఎస్‌ ఓడిపోయినందుకు పండుగ చేసుకుందామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో బల్మూరిని బలిపశువుని చేశారని వ్యాఖ్యానించారు. రేవంత్, భట్టిలు కలిసి తీసుకున్న నిర్ణయం వర్కవుట్‌ కాలేదన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో దీనిపై సీరియస్‌గా చర్చ ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్‌ తీర్పు ఊహించినట్టుగానే వచ్చిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఓటమిపై కాంగ్రెస్‌ పార్టీ సమీక్షించుకోవాల్సి ఉందని చెప్పారు.

Previous articleకారు బోల్తా పడి మున్సిపల్ డీఈ కి గాయాలు.. చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలింపు
Next articleబద్వేలు విజయం చరిత్రాత్మకం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here