బీజింగ్ అక్టోబర్ 22
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. వరుసగా ఐదో రోజూ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. కరోనా పరీక్షలను వేగవంతం చేసింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేయడంతోపాటు వందలాది విమానాలను రద్దు చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించింది. అలాగే సరిహద్దుల మూసివేతను కొనసాగిస్తున్నది.పర్యాటకులతో కలిసి ప్రయాణించిన ఒక వృద్ధ జంట కారణంగా చైనాలో తాజాగా కరోనా వైరస్ వ్యాపి చెందినట్లు ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. షాంఘై నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ వృద్ధ జంట జియాన్, గన్సు ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొత్తగా డజన్ల మేర కరోనా కేసులు ఈ వృద్ధ జంట ప్రయాణంతో ముడిపడి ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. బీజింగ్‌తో సహా ఐదు ప్రావిన్స్‌లలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు.గత 24 గంటల్లో ఉత్తర చైనాలోని మంగోలియా అటానమస్ రీజియన్‌లో 15 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. అల్క్సా లీగ్ (ప్రిఫెక్చర్) లోని ఎజినా బ్యానర్ (కౌంటీ)లో పద్నాలుగు కేసులు, జిలిన్ గోల్ లీగ్‌లోని ఎరెన్‌హాట్ నగరంలో ఒక కేసు నమోదైనట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు మూసి వేయడంతోపాటు వందలాది విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.