తిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టిటిడి జెఈవో వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ వాహనాలపై వివిధ అలంకారాలలో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.