మహబూబ్ నగర్, నవంబర్ 2
దేవరకద్ర ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావులు అన్నారు.
మంగళవారం దేవరకద్ర ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో 18.50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 10 పడకల ఐ సి యు వార్డును దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలలో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో దాతల సహకారంతో దేవరకద్ర పేహెచ్ సి లో ఐ సి యూ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని ,ఇందుకుగాను ముందుకు వచ్చిన నిర్మాణ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.పి హెచ్ సి లో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్మాన్ సి ఈ. ఓ వహీద్ ను కోరారు. దేవరకద్ర పి హెచ్ సి ఆధునీకరించడం వలన 5 మండలాల ప్రజలకు వైద్య సేవలు అందుతాయని అన్నారు. దేవరకద్ర పి హెచ్ సి లో పూర్తిస్థాయిలో సౌకర్యాలతోపాటు ఇద్దరు డాక్టర్లు ,ఏ ఎన్ ఎం పోస్టులను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేవరకద్ర శాసనసభ్యులు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ఇక్కడి నుండి హైదరాబాదుకు రోగులను తీసుకెళ్లేందుకు ఏదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్మాన్ సంస్థతో మాట్లాడి 30 లక్షల యంత్ర పరికరాలను ఏర్పాటు చేయడం జరిగిందని ,ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ చొరవతో ఐ సి యు నిర్మాణానికి 18 లక్షలు, మొత్తం కలిపి సుమారు 50 లక్షల రూపాయలతో ఐసియు వార్డు ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇది సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ,ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఆదుకునే విధంగా పి హెచ్ సి ని తయారు చేశామని అన్నారు. అదేవిధంగా కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తగిన సహకారం ఇవ్వాలని నిర్మాణ సంస్థ సీఈవో ఎండీ వహీద్ తో కోరారు.
నిర్మాన్ ఆర్గనైజేషన్ సిఈ ఓ వహీద్ దిశ సంస్థ సహకారంతో దేవరకద్ర పి హెచ్ సి కి 10 పడకల ఐసి యు వార్డ్ తో పాటు,25 ఆక్సీజన్ సీలిండర్లు ఇవ్వటం జరిగిందని , నెల రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, రికార్డు స్థాయిలో ఐసియు భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు .
డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ ,ఆర్డిఓ పద్మశ్రీ , తాసిల్దార్ జ్యోతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శబాన, జెడ్ పి టి సి అన్నపూర్ణ ,ఎంపీపీ రమాదేవి, సర్పంచ్ విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు