తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో లబ్ధిదారులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శనివారం జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లిలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య చీరలు పంపిణీ చేయగా, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆమనగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, షాద్‌నగర్, కొందుర్గు మండలాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఆయా మండలాల్లో, మున్సిపాలిటీలలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్‌లు చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగకు బతుకమ్మ చీరలు అందించడం సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. సర్కార్ అందిస్తున్న ఈ బతుకమ్మ చీరలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు.