హైదరాబాద్ అక్టోబర్ 29
గోదావరి – కావేరి లింక్ కోసం డీపీఆర్ రూపొందించామని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ భోపాల్ సింగ్ తెలిపారు.అన్ని రాష్ట్రాలకు డీపీఆర్ అందించామని, డీపీఆర్‌పై ఆయా రాష్ట్రాలు కూడా తమతమ అభిప్రాయాలు తెలిపాయని చెప్పారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు. హిమాలయ బేసిన్లో ఉన్న మిగులు జలాలను దక్షిణానికి తీసుకురావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానంపై హైదరాబాద్‌లో శుక్రవారం నాడు సమావేశం జరిగింది.జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండోసారి జరిగిన ఈ సంప్రదింపుల భేటీకి భాగ్యనగరంలోని జలసౌధ వేదికైంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మిగులు జలాలు ఉన్న రాష్ట్రాలు కూడా మిగులు లేదని అంటున్నాయని, ఈ విషయంలో పది రాష్ట్రాల అభిప్రాయాల కోసం సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని తెలిపారు.కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్‌లో ఉన్న నీటి లోటును తీర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పది లక్షల హెక్టార్లకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు వేస్తున్నామని, 87000 కోట్ల అంచనా వ్యయంతో ఈ అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, వివరాలను నెల రోజుల్లోపు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.ఈ అభిప్రాయ సేకరణ తర్వాత ఆ తదుపరి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘం ద్వారా ఖచ్చితమైన అధ్యయనం జరగాలని తెలంగాణ కోరగా.. తమ వాటాకు భంగం కలగకుండా చూడాలని ఏపీ డిమాండ్ చేసింది.