నెల్లూరు నవంబర్ 30
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరులో పలు డివిజన్లు ముంపునకు గురయ్యాయని, అలాంటి ప్రాంతాలలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కమిషనర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కమిషనర్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన సమీక్షిస్తూ వివిధ పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అన్ని వసతులు అందేలా సహాయక సిబ్బంది చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ముంపుకు గురైన ప్రాంతాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు జెసిబి వాహనాల తోటి పూడికతీత పనులతో పాటు సన్నటి కాలువలు తీయడం ద్వారా నీటిని తొలగించాలని సూచించారు. వర్షపు నీరు ఎక్కువగా చేరిన ముంపు ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని పూర్తిగా తొలగించాలని, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ద్వారా అంటురోగాలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.