శ్రీశైల దేవస్థానం
అక్టోబర్ 7వ తేదీన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం లో దసరా మహోత్సవాలు
ఈ నెల 7 నుండి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిదిరోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించబడే ఈ దసరా మహోత్సవాలు అక్టోబర్ 15వతేదీతో ముగియనున్నాయి.
సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించబడే ఈ ఉత్సవాలలో శ్రీ అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణ పూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం జరగనున్నాయి.
ముఖ్యంగా కోవిడ్ నివారణ చర్యలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది.
కాగా కోవిడ్ ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఈ సంవత్సరం గ్రామోత్సవం నిలుపుదల చేయబడింది. అయితే శ్రీ స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవం (ఆలయ ఉత్సవం) యథావిధిగా జరిపించబడుతుంది. గ్రామోత్సవం నిలుపుదల చేసిన కారణంగా భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా
గంగాధర మండపం వద్ద ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలను నిర్వహించబడుతాయి.
ఈ ఉత్సవాలకు నాందిగా 07,10,2021ఉదయం 8.30 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనము, దీక్షాసంకల్పం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణ కంకణధారణ జరిపించబడుతాయి.
తరువాత అమ్మవారి యాగశాలలో అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన, చండీ కలశస్థాపనము, చతుర్వేద పారాయణలు, విశేష కుంకుమార్చనలు, గణపతి పంచాక్షరీ, సుబ్రహ్మణ్మ, బాల, నవగ్రహ జపానుష్టాలు, సూర్యనమస్కారాలు, కుంకుమార్చనలు, కుమారి పూజలు నిర్వహించబడుతాయి.
అదేవిధంగా 10.45 గంటలకు శ్రీస్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం చేసి శివసంకల్పం, గణపతిపూజ, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదనలు జరిపించబడుతాయి.
ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం నుండి అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం,
అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు జరుగుతాయి.
ఆ తరువాత రుద్రహోమం, చండీహోమం జరిపించబడుతాయి. అనంతరం రాత్రి 9.00 గంటల నుండి నీరాజనమంత్రపుష్పములు, సువాసిని పూజ మహదాశీర్వచనం, తీర్థప్రసాదవితరణ కార్యక్రమా
జరిపించబడుతాయి.
కాగా ఈ కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి 49మంది ఋత్వికులను పిలిపించడం జరిగింది. దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు వీరు కూడా ఉత్సవనిర్వహణలో పాల్గొంటున్నారు.