మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి::
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమల అభివృద్దికి అధికారులు తగిన ప్రోత్సాహకాలు అందించి పరిశ్రమలు మరింత పెరిగేందుకు తగిన విధంగా సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, టీఎస్ బీపాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ మాట్లాడుతూ… మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలకు అనువుగా ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని… వనరులు కూడా ఉన్నందున పరిశ్రమలను నెలకొల్పేందుకు కొత్త పారిశ్రామికవేత్తలు ముందుకు రావడంతో పాటు గతంలో ఉన్న పరిశ్రమలను సైతం మరింత అభివృద్ది చేస్తున్నారని ఇది ఎంతో శుభసూచకమని అన్నారు. అలాగే జిల్లా పరిధిలో నూతనంగా పరిశ్రమల ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సహకరిస్తామని వివరించారు. జిల్లాలో అనేక పరిశ్రమలు ఉండటంతో పాటు మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంతో పాటు టీఎస్ బీపాస్ ద్వారా అన్ని రకాల వసతులు, సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యాంసన్ తెలిపారు. అలాగే జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని… కొత్తగా పరిశ్రమలు నెలకొల్పితే మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ దిశగా కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ రవీందర్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.