హైదరాబాద్ అక్టోబర్ 22
యాసంగి సీజన్ లో రైతులు ఈసారి మినుములు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని, దీనికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందజేస్తామని అన్నారు. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మార్క్ ఫెడ్ కేంద్ర కార్యాలయంలో పాలక వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభమైన నేపధ్యంలో రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని సూచించారు. మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిధ్దంగా వుందన్నారు. అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించిందని తెలిపారు.గురువారమే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ లిఖితపూర్వక హామీ ఇచ్చిందని తెలిపారు. మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీ పి.యాది రెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.