రేషన్ షాపుల్లో ఈ పాస్ యంత్రాలు మళ్లీ మొరాయిస్తున్నాయని, సర్వర్ సమస్యతో ఈ పోస్ యంత్రాలు పనిచేయకపోవడంతో డీలర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నందికొట్కూరు తహశీల్దార్ రాజశేఖర్ బాబు కు రేషన్ డీలర్లు విన్నించుకున్నారు. బుధవారం తహశీల్దార్ రాజశేఖర్ బాబుకు డీలర్లు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎండీయూల పంపిణీ సమయంలో సర్వర్ వేగంగా పనిచేసి రేషన్ పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్య ఎందుకొస్తుందని డీలర్లు ప్రశ్నించారు. సర్వర్ సమస్య ప్రతి నెల వస్తుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. రేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం ,గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడంతో జనాలు డీలర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వృద్దులు,మహిళలు,వికలాంగులు రేషన్ దుకాణాల వద్ద చాల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్వర్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సర్వర్ పనిచేస్తే రేషన్ నూటికి నూరుశాతం గడువులోగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. డీలర్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తహశీల్దార్ రాజశేఖర్ బాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల రేషన్ డీలర్లు సంఘం నాయకులు చాంద్ భాష, వలి భాష, ప్రాన్సిస్, శ్రీనివాసులు, రాముడు,సత్యం, రామ కొండారెడ్డి, సద్దాం హుస్సేన్, సత్యమయ్య,వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.