చిత్తూరు నవంబర్ 11
తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏడు టన్నుల పువ్వులతో టీటీడీ ఆధ్వర్యంలో ‘పుష్ప కైంకర్యం’ నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా ఆలయ కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన పుష్ప కైంకర్యంలో ఏడు టన్నుల పూలను ఉపయోగించారు. ఈ పువ్వులను తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన దాతలు అందజేశారు.ఇలాఉండగా, తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తితిదే ఆధికారులు వారికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.