హుజూరాబాద్ అక్టోబర్ 19
ఈటల రాజేందర్ గెలిస్తే కేవలం ఆయనకే లాభమని, కానీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు కే వెంకన్న, డీసీసీ అధికార ప్రతినిధి సలీం నాయకత్వంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆబాదీ జమ్మికుంటలోని కాటన్ మిల్లులో జరిగిన కార్యక్రమంలో వీరికి మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కాటన్‌మిల్లులో పనిచేసే హమాలీలు ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ ప్రతిని మంత్రులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జాతీయస్థాయిలో మాత్రమే పోటీపడతాయని, కానీ ఇక్కడ మాత్రం కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. అభాగ్యులందరికీ నెలనెలా సరిపోయే మొత్తం ఆసరా పింఛన్ అందజేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కూడా రూ. 600 పింఛన్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రైతులకు రూ.5లక్షల ప్రమాదబీమా ఇక్కడ తప్పా మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఘనతకూడా మనకే దక్కుతుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే రోల్‌మోడల్ అని పేర్కొన్నారు. అందుకే మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు తాము తెలంగాణలో కలుస్తామంటున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇటీవల తమను తెలంగాణలో కలిపిస్తే బాగుండు అని రాయచూరు ఎమ్మెల్యే కూడా అన్నారని గుర్తుచేశారు.