కడప,అక్టోబర్ 20
భారతీయ సంస్కృతి, ఇతిహాసాన్ని, మానవ సంబంధాలు, కుటుంబ విలువల సారాంశాన్ని అపురూపమైన రామాయణ గ్రంథంగా సమాజానికి అందించిన ‘వాల్మీకి మహర్షి’ భావితరాలకు ఆదర్శనీయం అని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు.
ఆశ్వీయుజ శుద్ధపౌర్ణమి అయిన బుధవారం.. కడప కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా బీసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు తో పాటు జేసీ (రెవెన్యూ) ఎం.గౌతమి, జేసీ (సంక్షేమం) ధర్మచంద్రారెడ్డి, డిఆర్వో మాలోల హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ.. భారతీయ చరిత్రలో సంస్కృత భాషలో పద్యాల రచన రామాయణంతోనే మొదలయ్యిందని.. ఆ ఘనత ఒక్క వాల్మీకి మహర్షికే దక్కుతుందన్నారు. సంస్కృతంలో పద్యాలు రాసిన తొలికవి కూడా.. ఆ మహానేయులేనన్నారు. వాల్మీకి చరితం గురించి కలెక్టర్ వివరిస్తూ.. పూర్వం ప్రచేతస అనే ఋషికీ జన్మించిన వాల్మీకి మహర్షి అసలు పేరు. రత్నాకరుడు అని.. చిన్నతనంలో ఆడుకునేందుకు అడవిలోకి వెళ్లి.. తప్పిపోయారన్నారు. అదే సమయంలో వేటకు వచ్చిన ఒక బోయ (వేటగాడు) వాడు.. రత్నాకరుడిని అక్కున చేర్చుకుని పెంచారు. ఈ నేపథ్యంలో కుటుంబ జీవనం కోసం వేట వృత్తిని చేపట్టడం జరిగిందన్నారు. ఒకానొక సందర్భంలో.. “తాను చేసే కిరాతక వృత్తిలో పాపాన్ని మీరు కుడా పాలు పంచుకుంటారా..” అని తన కుటుంబ సభ్యులను అడిగినప్పుడు.. ఏ ఒక్కరూ అంగీకరించలేదు. ఆ మరుక్షణమే రత్నాకరుడు పరివర్తన చెంది.. తాను మాత్రమే ఎందుకు ఈ కిరాతక వృత్తిధర్మంతో పాపాన్ని ఒడికట్టుకోవాలి..?? అనే ఆలోచనతో.. శ్రీరామ జపాన్ని జపిస్తూ… కొన్నేళ్ల పాటు అకుంఠిత దీక్షతో.. తపస్సు చేశారు. తన చుట్టూ చీమలపుట్ట పెరిగినా.. దీక్ష ను విరమించలేదన్నారు. మానవీయ సంబంధాలు, కుటుంబ వ్యవస్థకు సంబంధించి అద్భుతమైన నిర్వచనాన్ని.. రామాయణ మహా గ్రంథం ద్వారా చాటి చెప్పిన ఆదర్శప్రాయులు వాల్మీకి మహర్షి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో వాల్మీకి జయంత్యుత్సవాలను నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయం అని కలెక్టర్ వాల్మీకి చరిత్రను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా.. కార్యక్రమానికి హాజరైన.ముఖ్య అతిధులు రామాయణ ప్రాశస్త్యం, వాల్మీకి పురాణం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అంతకు ముందు మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణయ్య, సూపరింటెండెంట్ ఆంజనేయులు, బీసీ కార్పొరేషన్ ఇడి డా.హెచ్.వెంకట సుబ్బయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని సెక్షన్ సూపర్ ఇన్ టెండెంట్లు , బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.