హైదరాబాద్ సెప్టెంబర్ 25
రాష్ట్రంలో పర్యాటక రంగం సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనిమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని నివాసంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని (సెప్టెంబర్ 27) పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా టూరిజం పాలసీ రూపకల్పనపై ప్రతిపాదనలు రూపొందించి.. సీఎం కేసీఆర్‌కు అందజేయాలని ఆదేశించారు.వీటితో పాటు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శాఖ ఆధ్వర్యంలో విశిష్ట సేవలందిస్తున్న భాగస్వాములను ప్రోత్సహించేందుకు ఏటా ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గతేడాది కరోనా నేపథ్యంలో అవార్డులను వర్చువల్ విధానంలో అందజేసినట్లు చెప్పారు. ఈ ఏడాది 16 విభాగాల్లో 19 పర్యాటక శాఖ అనుబంధ భాగస్వాములకు ఎక్సలెన్స్ అవార్డులను, కొవిడ్ సమయంలో పర్యాటక శాఖ ఉద్యోగులకు వందే భారత్ మిషన్‌లో భాగంగా విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రత్యేక అవార్డులను మంత్రి.. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుతో కలిసి ప్రకటించారు.సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టంగా యునెస్కో గుర్తించిందని, రాష్ట్రంలో ఎన్నో వారసత్వ, ప్రాచీన చరిత్ర కలిగిన కట్టడాలున్నాయన్నారు. వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, చార్మినార్‌ను ప్రపంచవారసత్వ కట్టడాలుగా గుర్తింపు కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎక్స్‌క్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టూరిజం అధికారులు మహేశ్, ఓం ప్రకాశ్, శశిధర్, అంజిరెడ్డి పాల్గొన్నారు