శ్రీశైలం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం లో భక్తుల సౌకర్యార్థం ఈ రోజు నిత్య ప్రసాద వితరణలో పంక్తి భోజనాలు పునః ప్రారంభించబడ్డయి.
కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు భక్తులకు ప్రతీరోజు అన్నపొట్లాల ద్వారా అన్నప్రసాదాలను
అందజేయడం జరిగింది.
కాగా ఈ ఉదయం అన్నప్రసాద భవనములో ఈ పంక్తిభోజనాలు తిరిగి ప్రారంభించబడ్డాయి. గతములో మాదిరిగానే ప్రతిరోజు కూడా ఉదయం గం. 10.30ల నుంచి మధ్యాహ్నం గం.3.00ల వరకు ఈ అన్నప్రసాద వితరణను చేయడం జరుగుతోంది.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నప్రసాద వితరణను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కరోనా నివారణ ముందస్తు చర్యలను సంబంధిత ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్నదాన క్యూలైన్లలో భక్తులందరు కూడా మాస్కులు ధరించేవిధంగా మైకుద్వారా అవగాహన
కల్పించాలన్నారు. అదేవిధంగా భక్తులందరు కూడా భౌతికదూరాన్ని పాటించే విధంగా చర్యలు
చేపట్టాలన్నారు.
అన్నదానం క్యూలైన్లను, క్యూలైన్లపైపులను, అన్నప్రసాద భవనములోని కటాంజాలను, రైలింగులు మొదలైన వాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయపద్ధతిలో శానిటైజేషన్ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా ప్రతిరోజు కూడా సమయపాలనను పాటిస్తూ అన్నప్రసాద వితరణను జరపాలని సూచించారు. భక్తులందరితో కూడా మర్యాదగా మెలగాలని, భక్తుని అతిథిగా భావించాలన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అన్నప్రసాద వితరణ స్వీకరించే భక్తులతో సంభాషిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటుండాలని అన్నప్రసాదవితరణ విభాగ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారులు పి.నటరాజారావు, డి.మల్లయ్య, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు శ్రీమతి దేవిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.