బద్వేలు
బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత 20 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో దాదాపు ప్రతి సారి ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులు వైపే ఆసక్తి చూపారు. ఆ పార్టీలకే ఓట్లు వేసి గెలిపించారు. మిగిలిన పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు దక్కలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్నిసార్లు తెలుగుదేశం పలుమార్లు వైకాపా మూడు సార్లు విజయం సాధించాయి. బిజెపి పోటీచేసిన ప్రతిసారి ఓటమి తప్పలేదు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉండడంతో ఓటర్ల నాడీ అర్థం కాక మూడు పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఉప ఎన్నికలను వైకాపా కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు పార్టీల అగ్ర నేతలు బద్వేల్ లో తిష్ట వేసి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రెండువేల 2019 సాధారణ ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్ల మెజారిటీ కంటే ఎక్కువ సాధించడానికి వైకాపా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది .వైకాపా అభ్యర్థికి లక్ష ఓట్లకు పైగా మెజార్టీ రావాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదే పదే చెబుతున్నారు. ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని బిజెపి కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయి. బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మొత్తం 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగిలిన వారిలో ఏడు చిన్న పార్టీలు అయిదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఇద్దరిని వైకాపా నాయకులే ఎన్నికల అనుమతుల కోసం పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ ఒకరిద్దరు మినహా మిగిలిన వారు ఏమాత్రం ప్రచారం చేయడం లేదు. తమ సన్నిహితులు తెలిసిన వారి ఓటు దక్కించుకునేందుకు కొందరు ఇప్పటినుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలు వేదిక గా ఓట్లు కోరుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గమనిస్తే ఉప ఎన్నికల్లో వీరి ప్రభావం నామమాత్రమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.