హైదరాబాద్ అక్టోబర్ 21
: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరీక్షల నేపథ్యంలో ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు జరగనున్నాయి. గతంలో పరీక్షలు లేకుండా ప్రమోట్ అయిన విద్యార్థులు ఇప్పుడు రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిలబలో ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం కోత విధించింది. దీంతో 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతాయి.