హైదరాబాద్
నిరంతరం ప్రత్యేక తెలంగాణ కోసం తపించిన మహానీయులను, వారి త్యాగాలను స్మరించుకోవటం మన బాధ్యత అని అన్నారు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఆకాంక్షతో కూడిన పోరాటం, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందజంలో ఉండటం వారికి నిజమైన నివాళి అని మంత్రి అన్నారు. అరణ్య భవన్ లో జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కొండా లక్ష్మణ్ సేవలను కొనియాడి, నివాళులు అర్పించారు.