ఏలూరు అక్టోబర్ 4
రైతులకు జగన్ ప్రభుత్వం ఉరి బిగిస్తోందని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు జవహర్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ వదిలి ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు జవహర్ హితవుపలికారు. రైతు సమస్యలపై మొద్దునిద్ర వీడి ఈ ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గులాబ్ తుఫాన్ నష్టం అంచనా వేసి వెంటనే రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు గిట్టుబాటు ధర గాని యాంత్రీకరణ, సబ్సిడీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ చర్యలకు భయపడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. రైతు సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు జవహర్ తెలిపారు.