తిరుపతి, మా ప్రతినిధి, నవంబర్ 05,
టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలను శుక్రవారం జెఈవో సదా భార్గవి తనిఖీ చేశారు.
పాఠశాలలోని తరగతి గదులు, బోధనా విధానం, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్లను పరిశీలించి అవసరమైన సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. తరగతి గదుల్లోని ఉపాధ్యాయులను, విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం చక్కగా ఉండాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని పచ్చదనాన్ని పరిశీలించారు.
జెఈవో వెంట దేవస్థానం విద్యాశాఖాధికారి గోవిందరాజన్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.