హైదరాబాద్ అక్టోబర్4
జేఎన్‌టీయూ మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది వరకు బీటెక్ లో చేరితే నాలుగేండ్లపాటు వరుసగా చదువాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకోవచ్చు. స్టార్టప్స్‌లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు జేఎన్టీయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. బీటెక్ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్స్‌లో రాణిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ దశలో అటు చదువా.. ఇటు స్టార్ట ప్పా.. అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మధ్యలో చదువులు ఆపేస్తే పట్టా చేతికి అందదని.. చదువులకు ప్రాధాన్యమిస్తే మొగ్గదశలోనే నవ ఆలోచనలను తుంచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది.
మార్గదర్శకాలు..
• స్టార్టప్స్ వెంచర్లు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నవారే ఇందుకు అర్హులు.
• తొలి నాలుగు సెమిస్టర్లు పూర్తిచేసినవారికే అవకాశం. బ్యాక్‌ల్యాగ్స్ ఉన్నవారికి, హాజరుశాతంలేనివారికి ఈ అవకాశం ఉండదు.
• ఆయా విద్యార్థులు జేఎన్టీయూ వీసీకి రిపోర్ట్‌చేసి, అనుమతి పొందాలి. ఏ కారణం చేత బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో వెల్లడించాలి.
• తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సైతం అనుమతి పొందాల్సి ఉంటుంది.
• సంవత్సరం పూర్తికాగానే మరలా తిరిగి కోర్సులో చేరాలి.
Home తెలంగాణ జేఎన్‌టీయూ మరో కొత్త విధానానికి శ్రీకారం విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకోవచ్చు