న్యూఢిల్లీ అక్టోబర్ 22
సెప్టెంబర్‌లో ఉపాధి అవకాశాల్లో గణనీయమైన వృద్ధితో పాటు అక్టోబర్‌లో అదే జోరు కొనసాగుతుండటంతో జాబ్ మార్కెట్ కరోనాకు ముందున్న స్థితికి చేరుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో 85 లక్షల కొలువులు అందుబాటులోకి రాగా మొత్తం 46.2 కోట్ల మంది ఉద్యోగాల్లో కుదురుకున్నారని ఇది 2019-20లో కంటే కేవలం 27 లక్షలు తక్కువని సీఎంఐఈ పేర్కొంది. భారత్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య కొవిడ్-19కు ముందున్న స్ధాయిని అక్టోబర్‌లో అధిగమిస్తుందని సీఎంఐఈ పేర్కొంది.కార్మిక భాగస్వామ్య రేటు, ఉపాధి రేటు పెరుగుతుండటంతో అక్టోబర్‌లో ఇదే జోరు కొనసాగుతూ మరింత వృద్ధి చోటుచేసుకునే అవకాశం ఉందని ఉద్యోగాల సంఖ్య 2019-20 స్ధాయిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తోందని సీఎంఐఈ నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక అక్టోబర్ 17తో ముగిసిన వారాంతానికి కార్మిక భాగస్వామ్యం రేటు 41.6 శాతంగా ఉండగా, నిరుద్యోగ రేటు 7.6 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొంది.