హైదరాబాద్ నవంబర్ 26
తెలంగాణలోని టీచింగ్ హాస్పిటల్స్ లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో తమ డిమాండ్లపై జరిపిన చర్యలు సఫలమవడంతో సమ్మెను విరమించుకుంటున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. పీజీ మెడికల్, డిప్లొమా సీట్లలో సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజేయూడీఏ) సభ్యులు శుక్రవారం నుంచి వైద్య విధులను బహిష్కరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.సర్వీసులో ఉన్న ప్రభుత్వ వైద్యుల కోటా సీట్ల శాతాన్ని ఇకపై పెంచబోమని హరీశ్‌రావు హామీ ఇచ్చినట్లు జూడాలు పేర్కొన్నారు. రెగ్యులర్ వైద్యుల నియామకం కూడా చేపడుతామని మంత్రి తెలిపినట్లు వారు చెప్పారు. సర్వీస్‌లో ఉన్న డాక్టర్లకు, ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు సమానంగా పీజీ మెడికల్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని జూడాలు స్పష్టం చేశారు.