కడప నవంబర్ 20
ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వరద కడప గ్రామాలను ముంచెత్తింది. ఉధృతమై పల్లెలను చుట్టుముట్టి మృత్యువై ప్రాణాలను నీట కలిపేసుకుంది. కొట్టుకు పోయిన కల్వర్టులు కదలనీయని జలనాగుల మధ్య చిక్కుకుపోయిన ప్రయాణికుల బస్సులు. కూలిన రైల్వే వంతెన ఎటుచూసినా విలయ దృశ్యాలే. ఎవరిని కదిపినా జలఘోష రేపిన బీభత్సమే రెండు రోజులుగా కురిసిన వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు సమీపంలో చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. కట్ట తెంచుకున్న వరద ఊళ్లపై పడింది.చూస్తుండగానే జలసుడి గ్రామాలను చుట్టుముట్టింది. దాదాపు 57 మంది వరదల్లో గల్లంతయినట్టు సమాచారం. వంట సామగ్రి తిండిగింజలు కట్టుబట్టలు విలువైన బంగారు ఆభరణాలు నగదు రిఫ్రిజిరేటర్స్ బీరువాలు మంచాలు ఇలా సర్వం వరదార్పణం అయ్యాయి. అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు పింఛా ప్రాజెక్టుకు 38 వేల క్యూసెక్కులు ఉన్న వరద రాత్రి 7.30 గంటలకు లక్ష క్యూసెక్కులు దాటేసింది. అప్పటికే ఆ ప్రాజెక్టు రింగ్బండ్ కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు నుంచే కాకుండా మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ డ్యామ్ స్విల్వే డిశ్చార్జి కెపాసిటీ 2.85 లక్షల క్యూసెక్కులు కాగా 3.50 లక్షల క్యూసెక్కులకు అది చేరింది.ఏ క్షణమైనా కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెల్లవారుజామున అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ హెచ్చరికలు వచ్చిన గంటలోపే భారీశబ్దంతో డ్యామ్ కట్ట కొట్టుకుపోయింది. రాత్రంతా కురుస్తున్న వానలతో ఉధృతమై డ్యామ్ కట్ట తెగడంతో దిశమార్చుకున్న వరద తీర గ్రామాలను ఒక్క ఉదుటున ముంచెత్తింది. రాజంపేట మండలం రామాపురం చెక్పోస్టు దగ్గర వరద కడప తిరుపతి జాతీయ రహదారిని ముంచెత్తింది. ఆ సమయంలో అటుగా వచ్చిన పల్లె వెలుగు బస్సు పూర్తిగా మునిగిపోయింది. అందులోని 12 మందిలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.మిగిలిన వారిని బలగాలు రక్షించాయి. హస్తవరం-నందలూరు మధ్య చెయ్యేరు నదిపై నిర్మించిన చెన్నై-ముంబై ప్రధాన రైల్వే లైన్ బ్రిడ్జి కిలోమీటరు రైలుమార్గం ధ్వంసమయ్యాయి. ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను రేణిగుంట నుంచి రూటు మార్చినట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. రాజంపేట పట్టణ సమీపంలో ఊటుకూరు దగ్గర రోడ్డు కోతకు గురైంది. రైల్వేకోడూరు-ఆంజనేయపురం మధ్య వంతెనకు పెద్ద రంధ్రం పడింది. దీంతో కడప-తిరుపతి వయా రాజంపేట మధ్య రాకపోకలు స్తంభించాయి. చెయ్యేరు వరద సృష్టించిన నష్టంపై సీఎం జగన్ కడప జిల్లా కలెక్టరు వి.విజయరామరాజుకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. వరదలు వర్షాలకు కడప జిల్లాలో 12 మంది మృతి చెందినట్టు కలెక్టరు వెల్లడించాయి.పులపుత్తూరులో రెండు మందపల్లిలో రెండు రామాపురం ఆర్టీసీ బస్సులో మూడు అక్కడికి సమీపంలో మరొకరు గుండ్లూరు శివాలయం లో ఒకటి మసీదులో ఒకటి నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లిలో రెండు మృతదేహాలు గుర్తించినట్టు చెబుతున్నారు. పులపుత్తూరులోని పురాతన శివాలయానికి కార్తీక పూజల కోసం భక్తులు తెల్లవారుజామునే వెళ్లారు. డ్యాంకట్ట తెగిపోయి శివాలయాన్ని వరద ముంచెత్తే సమయానికి వారంతా పూజల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే గుడి వరద చుట్టేసింది. అప్రమత్తం అయ్యేలోపే పుజారి కుటుంబం సహా భక్తులు గల్లంతయ్యారు. పూజారి కుటుంబంలోనే తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబం సహా 22 మంది గల్లంతయినట్టు తనకు సమాచారం ఉన్నదని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు.