Home ఆంధ్రప్రదేశ్ శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం మాడ వీధుల్లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత...

శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం మాడ వీధుల్లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ద‌ర్శ‌నం

284
0

తిరుమల,  న‌వంబ‌రు 16

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గం.ల వరకు స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రాశ‌స్త్యం..

పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, విజివో  బాలిరెడ్డి, ఎవిఎస్వో  సురేంద్ర‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Previous articleవర్షాల కారణంగా బురదగా మారిన జాతీయ రహదారి వాహనాల నిలిపివేత
Next articleఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణకై 18న ఛలో అసెంబ్లీ -టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లు వేణు గోపాల్, మాసాపేట శివ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here