కరీంనగర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ లో తెలంగాణ ట్రైన్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
విద్యా వలంటీర్ల అప్రకటిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి శాసన మండలి వేదికగా కృషి చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 వేల విద్యా వలంటీర్లను రెనీవల్ చేయాలని.. గత విద్యా సంవత్సరంలో విద్యా వలంటీర్ల తో పూర్తిస్థాయిలో పని తీసుకొని వారికి జీతాలు చెల్లించమంటే ప్రభుత్వానికి చేత కావడం లేదని ఆరోపించారు. విద్యా వలంటీర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టని ప్రభుత్వం..కనీసం విద్యా వలంటీర్ల నియామకం చేసి..ఉన్నవారిని రెనీవల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి ఇంతగా ఆలోచించాల అని ప్రశ్నించారు. కరోనా కారణంగా ప్రయివేటు స్కూళ్లు మూతపడి ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు చేరుతున్నారని వారికి సరిపడా ఉపాధ్యాయులు ఎక్కడున్నారని దుయ్యబట్టారు. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టు లు ఎలా బోధిస్తారాని విస్మయం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యా వలంటీర్ల ను రెనీవల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జి డాక్టర్ మేడిపల్లి సత్యం, నాయకులు సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అంజుమన్ తరక్ఖి ఉర్దూ అధ్యక్షుడు సర్వర్ షా బియబాని, ట్రైన్డ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ముత్తహరోద్దీన్, ఇష్థియాక్, ఇజహర్ హుస్సేన్, తెలుగు ట్రైన్డ్ టీచర్లు రేఖ, అనుపమ, నగేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.