సిద్దిపేట
సిద్దిపేట లాల్ కమాన్ పైనిన్న అర్ధరాత్రి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ బిజెపి నాయకులు సంఘటన ప్రదేశానికి వెళ్లి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ బిజెపి నాయకులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.. ముసుగు ధరించిన వ్యక్తులు ఎవరో తమకు తెలియాలని కాంగ్రెస్ బిజెపి నాయకులు పోలీసులతో వాదనకు దిగారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే పొద్దంతా ఏర్పాటు చేయాలి కానీ. అర్ధరాత్రి విగ్రహ ఆవిష్కరణ ఏమిటని ప్రశ్నించారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన లాల్ కమాన్ పై కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని బిజెపి కాంగ్రెస్ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. లాల్ కమాన్ పై ఏర్పాటు చేసిన కేసీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించాలంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఇందుకు కారకులైన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించాలని నినాదాలు చేశారు. ఏ సి పి దేవారెడ్డి పోలీసు సిబ్బందితో అక్కడికి వెళ్లి ఇరువర్గాలకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించారు. కేసీఆర్ విగ్రహం ఏర్పాటు విషయం పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేపింది.