హైదరాబాద్ నవంబర్ 30
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మరణవార్త నుంచి సినీ ప్రేక్షకులు కోలుకునేలోపే మరో విషాదం అలుముకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన జన్మించారు. తండ్రి సీవీ యోగి వేదపండితుడు, తల్లి అమ్మాజి గృహిణి. సీతారామశాస్త్రికి ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు. అనకాపల్లిలోని మున్సిపల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేశారు. అనంతరం అనకాపల్లిలోని బీఎస్ఎన్ఎల్ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ఆర్‌ఎస్ఎస్‌లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక, దేశభక్తి గీతాలు రాయడం సీతారామశాస్త్రికి అలవాటు. అనేక కార్యక్రమాల్లో సైతం సొంతంగా పాటలు రాసి అలపించేవారు.