నందికొట్కూరు. సెప్టంబర్ 13
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలు, అన్యాయాలను ఎండగట్టేందుకు తెలుగు దేశం పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా నేటి నుంచి 18వ తేదీ వరకు ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందని ఇందులో భాగంగా 14న నందికొట్కూరు నియోజకవర్గం కేంద్రము లో చేపట్టనున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని పార్టీ నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆరు మండలాల పార్టీ సమన్వయ కర్తలు, కార్యకర్తలతో
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. మద్దతు ధర లేదు, పెట్టుబడులు కోల్పోయి, అప్పులపాలైన రైతుల సమస్యలు, పంటల బీమా సకాలంలో చెల్లించకపోవడంతో నష్టం, వరస విపత్తుల్లో పైసా పరిహారం అందించకపోవడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, గిట్టుబాటు ధరలు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడం వంటి చర్యలకు వ్యతిరకంగా ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.వైసిపి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు. జగన్ రైతులకు చేస్తున్న మోసం, అన్యాయాన్ని ప్రజల్లో ఎండగడతామని అన్నారు.
వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు.
ధరల స్థిరీకరణ నిధికి రూ,500కోట్లు కేటాయించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీ విస్మరించారని, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని తీవ్రంగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారులు చేరి చివరకు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు.మిడుతూరు మండలము అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు ల పేరిట నీటిని తోడేశారని, నీరు లేక వెలవెల పోయిందని, అయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.కరోనా కాలం లో మృతి చెందిన కుటుంబాలకు రూ, 10 లక్షలు పరిహారం చెల్లించాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్రోల్,డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు భారంగా మారాయన్నారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, ప్రాత కోట సర్పంచ్ శేషమ్మ, మండల టిడిపి కన్వీనర్ లు పలుచాని మహేష్ రెడ్డి,ఓబుల్ రెడ్డి, కాతా రమేష్ రెడ్డి, టిడిపి జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు యాదవ్, గిరీష్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మూర్తు జావళి, టిడిపి పట్టణ నాయకులు మద్దిలేటి, కళాకార్ , వేణు, జయసూర్య, తదితరులు పాల్గొన్నారు.