కొత్తగూడెం నవంబర్ 13
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజినల్ కమిటీ స్థాయి నాయకుడు రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ మృతి వార్తని పార్టీ ఆలస్యంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించాడు. 2014లో రవి జార్ఖండ్‌కు వెళ్లి అక్కడే ఉంటూ ఆ పార్టీ గెరిల్లా ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు.ఇదిలా ఉండగా జార్ఖండ్ లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో గెరిల్లా ఆర్మీ ఎత్తుగడల క్యాంపైన్ లో భాగంగా గత ఏడాది జూన్ 25వ తేదీన బాణం బాంబు పరిశీలించే క్రమంలో ప్రమాదవశాత్తు అది విస్ఫోటనం చెందడంతో తీవ్రంగా గాయపడి రవి మృతిచెందాడు. ఆ మరుసటి రోజే విప్లవ లాంఛనాలతో రవి అంత్యక్రియలు నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ కేంద్రం కమిటి నాయకులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు నాయకుడి మృతిని ఏడాదిన్నర ఆలస్యంగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.