న్యూఢిల్లీ
కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పీఎల్ఐ స్కీం కింద దేశంలో ఏర్పాటు చేయనున్న మూడు విద్యుత్ ఉపకరణ జోన్లల్లో ఒకటి ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. భారీ విద్యుత్ ఉపకరణాల జోన్గా మన్నవరం అనుకూలమని వెల్లడించారు. గతంలో ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్కు కేటాయించిన 750 ఎకరాల భూమిని ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ గా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి మేకపాటికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మన్నవరం విద్యుత్ ఉపకరణాల జోన్పై త్వరలో ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో సమావేశం వుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వాణిజ్య ఉత్సవం- 2021ని కేంద్ర మంత్రి అభినందించారు. కొప్పర్తిలో భారీ టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు గురించి కేంద్ర మంత్రి పీయూష్ దృష్టికి మంత్రి మేకపాటి తీసుకువెళ్లారు. విశాఖ-చెన్నై కారిడార్లో రాష్ట్ర వాటాను 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని వినతి చేసారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి మంత్రి మేకపాటి ప్రతిపాదనను గతిశక్తిలో ఏపీ భాగస్వామ్యం అవడం ద్వారా సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు.