హైదరాబాద్
జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సమీపంలో టిష్యూకల్చర్ ల్యాబోరేటరీ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి రు, కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రూ.4.2 కోట్లతో జీడిమెట్లలో టిష్యూకల్చర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వరంగంలో రాష్ట్రంలో ఇది మొదటిది. మొక్కల పెంపకం, ఉత్పత్తి, పునరుత్పత్తిలో ఇదొక విప్లవం. విత్తన, పండ్ల, ఔషధ, సుగంధ ద్రవ్య, అటవీ, అలంకరణ వంటి అన్నిరకాల మొక్కలు టిష్యూకల్చర్ ద్వారా మేలురకమైన జాతుల ఉత్పత్తి చేస్తాం. అన్ని రకాల మొక్కల ఉత్పత్తికి ప్రాథమిక, మూల ఉత్పత్తిగా ఇది ఉపయోగపడుతుంది. పరిశోధనా ఫలితాలు వేగంగా రైతులకు అందాలి. గొప్ప మార్పుకు ఈ రోజు శ్రీకారం మొదలయింది. 9 నెలల లోపు మౌళిక సదుపాయాల ఏర్పాటు పూర్తవుతుంది. సాధ్యమయితే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటాం. ఇది వ్యవసాయరంగంలో సాంకేతికంగా తెలంగాణ ఖ్యాతిని పెంచుతుంది. టిష్యూకల్చర్ మొక్కలకు మార్కెట్ లో డిమాండ్ వేగంగా పెరుగుతుంది. భవిష్యత్ లో ఇక్కడి నుండే హరితహారం మొక్కలను అందిస్తాం. గంధం, టేకు మొక్కలు అటవీశాఖ ద్వారా రైతులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సాంప్రదాయ మొక్కలతో పోలిస్తే టిష్యూకల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తివంతమైనవే కాకుండా వేగంగా పెరగడంతో పాటు నాణ్యంగా ఉంటాయి. వ్యాధుల బారిన పడకపోగా మంచి దిగుబడిని అందిస్తాయని అన్నారు.